మహాన్ మూవీ రివ్యూ

విక్రమ్ ‘మహాన్’సినిమా రివ్యూ

Emotional Engagement Emoji (EEE) 

👍

విక్రమ్ ప్రస్తుతం  ఫామ్ లో లేకపోవచ్చు. కొంత కాలం క్రితం  హిట్లు కొట్టొచ్చు. ఇప్పుడు కొట్ట‌క‌పోవొచ్చు. కానీ క‌థ‌ల విష‌యంలో ఎప్పుడూ త‌ప్పు చేయ‌లేదనిపించుకుంటున్నాడు. కొన్నిసార్లు మంచి క‌థ‌ల్ని సైతం.. డైరక్టర్ స‌రిగా తెరకు ఎక్కించక‌పోవ‌డం వ‌ల్ల విక్రమ్ విఫ‌ల‌మ‌య్యాడు కానీ, నిజానికి క‌థ‌ల విష‌యంలో త‌న జ‌డ్జిమెంట్ బాగుంటుంది. అయితే వరస ఫ్లాఫుల త‌ర‌వాత‌.. విక్రమ్ క‌థ‌ల ఎంపిక‌పై కొన్ని అనుమానాలు మొద‌ల‌య్యాయి. వాటిని పోగొట్టాలంటే ఓ సక్సెస్  త‌ప్ప‌నిస‌రి. అలాంటి ప‌రిస్థితుల్లో `మహాన్` వ‌చ్చింది. మ‌రి ఈసారి విక్రమ్ ఏం చేశాడు? మహాన్ …విక్రమ్ పై ఉన్న న‌మ్మ‌కాన్ని, నాని ఈ క‌థ‌పై పెట్టుకున్న న‌మ్మకాన్ని ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టింది?

స్టోరీ లైన్

గాంధీయిజం ఫాలో అవుతూ( ఓ రకంగా బలంగా రుద్దబడ్డ) ఎదిగిన కామర్స్ లెక్చరర్ గాంధీమహాన్‌ (విక్రమ్‌) . అతని భార్య ఝాన్సి (సిమ్రన్) కూడా సేమ్ టు సేమ్.  వాళ్లకో  కొడుకు దాదాభాయి నౌరోజీ (ధ్రువ్ విక్రమ్). ఇలా జీవితం ప్రశాంతంగా నడిచిపోతున్నా మహాన్ లో ఏదో తెలియని అశాంతి. తను అందరిలా కలర్స్ టీ షర్ట్ వేసుకుని బార్ కెళ్లి మందుకొట్టాలని ఆశ..ఆలోచన. ఓ రోజు ఫ్యామిలీ ఇంట్లో లేని టైమ్ లో ధైర్యం చేస్తాడు. తన ప్రెండ్  సత్యవాన్ (బాబీ సింహ)తో కలసి ఫుల్ గా మందుకొట్టి వస్తాడు. ఈ విషయం తెలిసి భార్య తన కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది. (మార్చుకోవాలని అనుకోదు..ఒకసారే కదా అని సరిపెట్టుకోదు) దాంతో మహాన్ ఒంటిరి అవటంతో సత్యవాన్ తో కలిసి నెక్ట్స్ లెవిల్ కు ప్రయాణం మొదలెడతాడు. త్వరలోనే లిక్కర్ డాన్ గా ఎదుగుతాడు. ఇక తను అనుకున్నదే జరుగుతోంది ..హ్యాపీ అనుకునే టైమ్ కు …కొడుకు పెద్దోడై పోలీస్ గా వచ్చి తండ్రి లిక్కర్ సిండికేట్ పై ఉక్కుపాదం మోపుతాడు. అంతేకాదు మహాన్ స్నేహితులను టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు మహాన్ ఏం చెయ్యగలడు. తన సామ్రాజాన్ని కాపాడుకోవాలా లేక తన కొడుకు చేతిలో బలి అవ్వాలా…ఏం చెయ్యాలి?

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

కొత్త‌ద‌నం నిండిన క‌థ‌ల్ని ఎంచుకునే విక్రమ్  కూడా అప్పుడ‌ప్పుడూ ఇలా దారి త‌ప్పుతాడ‌ని ఈ సినిమాతో అర్థ‌మైంది. ఒక ఐడియాలజీని అతిగా ఫాలోయితే జరిగే అనర్ధాలు ఎలా వుంటాయి ? అని చెప్దామని మొదలెట్టిన కథ ..ఐడియాలజీని అతిగా ఫాలో అయ్యి…అనర్దం జరిగిపోయింది.

తొలి ప‌ది నిమిషాల్లో హీరో ఎవరు, నేపధ్యం, ఆ క్యారెక్ట‌రైజేష‌న్ అర్థ‌మైపోయాయి. ఆ త‌ర‌వాత‌.. అతను తీసుకున్న నిర్ణయం వలన ఎలాంటి సమస్య వచ్చింది, ఎంత యాక్షన్ పుట్టింది అనేదే ముఖ్యం. సినిమా ప్రారంభ‌మై అర్థ గంట గ‌డిచినా … ఆ క‌థ హీరో ఆలోచనలు, అందుకు దారి తీసే పరిస్దితులు చుట్టూనే తిరిగితే… ప్రేక్ష‌కుడికి బోర్ కొట్ట‌కుండా ఎలా ఉంటుంది? ఇలాంటి  కాన్సెప్టుతో ప్రేక్ష‌కుల్ని ఎంతైనా యాక్షన్ పుట్టించొచ్చు. పైగా.. ఇక్క‌డ ద‌ర్శ‌కుడికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే.. వాళ్లిద్దరు నిజ జీవిత తండ్రి కొడుకులే. కాబ‌ట్టి.. మిగతా పాత్ర‌ల నుంచి కావ‌ల్సినంత డ్రామా పిండొచ్చు. కానీ అది ఇక్క‌డ జ‌ర‌గ‌లేదు. తొలి సీన్ లో ద‌ర్శ‌కుడు ఏం చెప్పాడో.. 20 వ సీన్‌లోనూ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీటెడ్ సన్నివేశాన్ని, ఎమోష‌న్‌నీ మ‌ళ్లీ మ‌ళ్లీ చూసిన ఫీలింగ్ ఆడియ‌న్ కి క‌లుగుతుంది.

ఇక సెకండాఫ్ లో పూర్తిగా యాక్షన్ మోడ్ తీసుకుంది క‌థ‌. ఇక్క‌డ‌.. ప్రేక్ష‌కుడ్ని, క‌థ‌లోని పాత్ర‌ల్నీ యాక్షన్ లోకి నెట్టాల‌ని చూశాడు ద‌ర్శ‌కుడు. అది కూడా క్యారక్టరైజేషన్స్ లో బలం లేకపోవటం వల్ల వ‌ర్క‌వుట్ కాలేదు.  విక్రమ్ పాత్ర‌ని అండ‌ర్ ప్లే చేయించ‌డం ప్ర‌ధాన‌మైన లోపంగా మారింది. ఆ పాత్ర‌ని రొటీన్ కి భిన్నంగా గా మార్చి, దాని వ‌ల్ల మిగిలిన వాళ్లంతా ఇబ్బందిప‌డిన‌ట్టు చూపిస్తే.. కచ్చితంగా వ‌ర్క‌వుట్ అయ్యే సినిమానే. గాంధీ సిద్దాంతం, అతివాదతనం ఈ రెంటికి మధ్య తేడాని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడే త‌ప్ప‌, ఆ స‌న్నివేశాలు క‌థ‌లో ఇమ‌డ‌లేక‌పోయాయి. హీరోకి ఓ సమస్య ఉంది. దాన్ని యాక్షన్ తో  చెప్పాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. పోనీ.. ఆ రూపంలో అయినా హీరో పాత్ర‌పై సానుభూతి అయినా క‌ల‌గాలి. అదీ జ‌ర‌గ‌లేదు. దాంతో అటు యాక్షన్ కు, ఇటు ఎమోష‌న్ రెండింటికీ దూరంగా.. మహాన్ మిగిలిపోయింది.

తండ్రి,కొడుకుల  ట్రాక్ అయినా కొత్త‌గా ఉందీ అనుకుంటే, అదీ జ‌ర‌గ‌లేదు. ఇంట్రవెల్  సీన్‌, దానికి లీడ్ గా వ‌చ్చే స‌న్నివేశాలు.. ఇవ‌న్నీ పేల‌వంగా న‌డిచాయి. క్లైమాక్స్  స‌న్నివేశాలూ బ‌లంగా లేవు. కాన్సెప్టుల్ని న‌మ్ముకున్న‌ప్పుడు స్క్రిప్టు ద‌శ‌లో చాలా క‌ష్ట‌ప‌డాలి. ర‌చ‌యిత ప‌నిత‌నం చూపించగలగాలి. అది ఈ సినిమాలో జ‌ర‌గ‌లేదు. కాన్సెప్టుని నిల‌బెట్టే స‌న్నివేశాలేం ఈ సినిమాలో లేక‌పోవ‌డం పెద్ద లోపం. క్యారెక్ట‌రైజేష‌న్లు బ‌లంగా లేక‌పోవ‌డం, యాక్షన్‌, ఎమోష‌న్ ఇవి రెండూ పండ‌క‌పోవ‌డం.. శాపాలుగా మారాయి. దాంతో కొన్ని సీన్స్  బాగున్నా.. చూడ్డానికి యావ‌రేజ్ స్థాయి ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఏదైమైనా కాన్సెప్టు ఏదైనా,ఎలాంటిదైనా స‌రే, దాన్ని నిల‌బెట్టేది క‌చ్చితంగా స‌న్నివేశాలే. ఆ స‌న్నివేశాల లోపం.. అడుగ‌డుగునా క‌నిపించింది. అందుకే ప్ర‌తీ సీన్‌లోనూ మహాన్  నిరాశ ప‌రిచింది.

ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే…

ఇన్నేళ్ల తర్వాత విక్రమ్  కొత్త‌గా చేసిందేం లేదు. ఎమోష‌న్ సీన్ల‌లో ప‌ట్టీబ‌ట్టి న‌టించిన‌ట్టు అనిపించింది.ఆయన నటన బాగా చేయగలడు, ఫైట్స్ బాగా చేయ‌గ‌ల‌డు. డాన్సులు బాగుంటాయి. ఆ బ‌లాల్నీ  ఉన్నంతలో స‌రిగా వాడుకోలేదు. విక్రమ్ సినిమా అంటే ఆశించేవేమీ ఈ సినిమాలో లేవు. ధృవ్ బాగా చేసాడు. ఓ సైకిక్ గా దూసుకుపోయాడు. భార్య  పాత్ర‌లో సిమ్రాన్ మ‌రోసారి ఒదిగిపోయింది. భర్త,త‌ల్లీ కొడుకుల సెంటిమెంట్ కాస్త పండిందంటే కార‌ణం త‌నే.  నటీనటులు  చాలామందే ఉన్నా – ఎవ‌రికీ నోటెడ్ పాత్ర ద‌క్క‌లేదు.  బాబి సింహా వంటి వాళ్లంతా బాగానే చేసినా, ఎవ‌రి పాత్రా స‌రిగా ఫోక‌స్ అవ్వ‌దు.

డైరక్షన్,మిగతా క్రాప్ట్ లు ..

గాంధీయిజం, అతివాదం మధ్య తేడా వుందని చెప్దామని రాసుకున్న కథ ఇది. అయితే ఇలాంటి కథకు తగ్గ స్టాండర్డ్స్ అయితే లేవు. కేవలం ఇది తండ్రి ,కొడుకుల మధ్య రివేంజ్ కథలా మారిపోయింది. అలాగే క్లైమాక్స్ లో ఏదో ట్విస్ట్ ఇద్దామనే ఉద్దేశ్యంలో సత్యవాన్ పాత్రను చంపేయటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే  కేవలం మందు తాగాడని భర్తని వదిలేసిన భార్య సిమ్రన్ పాత్రని చూస్తే బాగా ఓవర్ అనిపిస్తుంది. కానీ ఆ సీనే కథకు కీలకం. దాన్నే అంత బలహీనంగా రాసుకున్నాడే అనిపిస్తుంది. దర్శకుడుగా కార్తిక్ సుబ్బరాజు మేకింగ్ విషయంలో మంచి పరిణితి కనపడుతుంది.

సంతోష్‌ నారాయణ్‌ పాటల్లో విషయం లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  ఎడిటర్‌ వివేక్‌ హర్షన్‌ మీద కోపం వస్తుంది. కెమెరా వర్క్  సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్  బాగున్నాయి. డైలాగులు బాగున్నాయి. డబ్బింగ్ లా అనిపించలేదు.

తెర వెనక..ముందు

బ్యానర్ : సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో;
నటీనటులు: విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్‌, సిమ్రన్‌, బాబీ సింహా, వాణీ భోజన్‌, తదితరులు;
సంగీతం: సంతోషన్‌ నారాయణన్‌;
ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌;
సినిమాటోగ్రఫీ: శ్రేయస్‌ కృష్ణ;
కథ, కథనం, దర్శకత్వం: కార్తిక్‌ సుబ్బరాజ్‌;
నిర్మాత: లలిత్‌కుమార్‌;
రన్ టైమ్:162 నిముషాలు
విడుదల తేదీ: 10-2-2021;
స్ట్రీమింగ్‌: అమెజాన్‌ ప్రైమ్‌.