Rating:1.5
 
డిమ్ లైట్…రూమ్ లో ఓ అమ్మాయి మంచానికి కట్టేసి ఉంది. చుట్టూ హాస్పటిల్ వాతావరణం. చిత్రమైన మ్యూజిక్, మరో అమ్మాయి…ఆ బెడ్ చుట్టూ రౌండ్స్ వేస్తూ ,చేతిలో ఓ పదునైన వస్తువుని పట్టుకుని ఆ అమ్మాయి వంక తీవ్రంగా చూస్తోంది. ఈ సీన్ ఈ సినిమాలో ఫస్ట్ సీన్. చూడగానే మనం ఏదో ఓ గొప్ప సైకో థ్రిల్లర్ చూడబోతున్నామనే ఆశ కల్గిస్తుంది. లాక్ డౌన్ టైమ్ లో ఫెరఫెక్ట్ మూవీ అనిపిస్తుంది. అయితే ఆ ఇంటెన్సటీ చివరి దాకా మెయింటైన్ చేసారా…మిసెస్ సీరియల్ కిల్లర్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి..అసలు కథ ఏంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్ ఏంటి…
 
పైన చెప్పబడ్డ మొదట సీన్ లో పదునైన వస్తువు పట్టుకుని తిరుగుతున్న ఆమె పేరు షోనా (జాక్వెలిన్ ఫెర్నాండెజ్). ఆమె ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ మృత్యుంజయ ముఖర్జీ (మనోజ్ బాజ్‌పాయ్)భార్య. హ్యాపీగా జీవితం నడుస్తున్న సమయంలో ..ఓ రోజు మృత్యుంజయ ముఖర్జీ ఓ సీరియల్ కిల్లర్( పెళ్లి కాకుండా తల్లి అవుతున్న వాళ్లను చంపే కిల్లర్) అని ఓ పోలీస్ అధికారి ఇమ్రాన్ (మోహిత్ రైనా) ఆధారాలతో సహా ప్రూవ్ చేసి పట్టుకుని జైలుకు పంపుతాడు. కానీ తన భర్త అలాంటి వాడు కాదని ఆమెకు ప్రగాఢ నమ్మకం. దాంతో తను అమాయకుడు అని నమ్మే భర్తను సేవ్ చేసుకోవటం కోసం ఓ లాయిర్ ని పట్టుకుంటుంది. ఆ లాయిర్ ఓ సలహా ఇస్తాడు. నీ భర్త ఎలాంటి వాడు అనేది ప్రక్కన పెడితే… సీరియల్ కిల్లర్ అంటున్నారు కాబట్టి…అతను బయిటకు రావాలంటే ఆ సీరియల్ కిల్లర్ ఇతను కాదు..పొరపాటు పడ్డారు పోలీస్ లు అని ప్రూవ్ చేయాలి.

అలా జరగాలంటే ఆ సీరియల్ కిల్లర్…మరో మర్డర్ చేయాలి. అప్పుడు అసలు సీరియల్ కిల్లర్ బయిటే ఉన్నాడని ప్రూవ్ చేసి, మీ ఆయన్ని బయిటకు తీసుకురావచ్చు అంటాడు. దాంతో ఇప్పుడా సీరియల్ కిల్లర్ వచ్చి మర్డర్ చేసే దాకా మా ఆయన జైల్లో శిక్ష పడకుండా ఉండాలంటే కష్టం. అందుకు ఒకటే దారి నేనే ఆ సీరియల్ కిల్లర్ అవతారం ఎత్తి…అలాంటి మర్డరే ఒకటి చేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించి..ఓ పెళ్లికాకుండా ప్రెగ్నెంట్ అయ్యిన అమ్మాయిని ఎంపిక చేసుకుని కిడ్నాప్ చేస్తుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని చంపేస్తుందా… అసలు సీరియల్ కిల్లర్ ఎవరు… మృత్యుంజయ ముఖర్జీ  బయిటకు వస్తాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమా పూర్తిగా ప్యాసివ్ క్యారక్టరైజేషన్. ఎంతసేపూ తను అనుకున్నట్లుగా ప్లాన్ వేసి అమలు జరపటమే కానీ పెద్దగా ప్రధాన పాత్రకు సమస్యలు ఎదురుకావు. అలాగే థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ ఈ సినిమాకు ఉండవు. తాను సీరియల్ కిల్లర్ కావాలని ప్రధాన పాత్ర ఫిక్సై , అందుకు తగ్గ పని చేస్తున్నప్పుడు ఊహకు అందని విధంగా ఇరుక్కుపోవాలి. అప్పుడు అది చిరంజీవి అభిలాష లాంటి సినిమా అవుతుంది. అలా కానప్పుడు ఇలా డల్ గా సాగుతుంది. సమస్యలో పడకుండానే సినిమా పూర్తే పోతుంది. సీరియల్ కిల్లర్ తనంతట తానే వచ్చి..నేనే వాడిని అని రివీల్ అయ్యిపోతాడు. ఇలా జరిగే కథ ఎంత బోరింగ్ గా ఉంటుంది. ఎంత నీరసంగా ఉంటుంది. అదే ఈ సినిమాని దెబ్బ తీసింది. పాయింట్ గా బాగున్నా…స్క్రీన్ ప్లే ఈ సినిమాని పూర్తి స్దాయిలో పాడు చేసింది.
 
టెక్నికల్ గా …

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ పెద్దగా ఏమీ లేవు. రవిచంద్రన్ వంటి గొప్ప ఛాయాగ్రాహకుడు పని చేసినా ..ఆ లుక్ ఎక్కడా కనపడదు. చీప్ లో చుట్టేసిన వ్యవహారం కాబట్టి సినిమా చూస్తున్న ఫీల్ రాదు. సీరియల్ ని కొన్ని ఎపిసోడ్స్ ఎడిట్ చేసి ఓ కథగా మన ముందు పెట్టినట్లుంది. కథ,స్క్రీన్ ప్లే లోనే లోపం ఉందనే విషయం మనకు అడుగడుగునా అనిపిస్తూనే ఉంటుంది. ఎంగేజ్ చేయని థ్రిల్లర్స్ ని ఎంత స్పీడుగా ఎవాయిడ్ చేద్దామా అనిపిస్తుంది. అందులోనూ చేతిలో కర్సర్ ఉన్నప్పుడు మరీను.

చూడచ్చా

జాక్విలిన్, మనోజ్ బాజపేయి  ఉన్నారు కదా అని ఆవేశపడితే చివరకు ఆయాసమే మిగులుతుంది.

ఎవరెవరు..నటీనటులు :  జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మనోజ్ బాజ్‌పాయ్, మోహిత్ రైనా, జైన్ మేరీ తదితరులుదర్శకుడు :  శిరీష్ కుందర్నిర్మాతలు :  ఫరా ఖాన్, శిరీష్ కుందర్ఛాయాగ్రాహకులు :  రవి కె. చంద్రన్, కిరణ్ డియోహన్స్