హిట్ మూవీ రివ్యూ
 
బట్…(‘హిట్’ మూవీ రివ్యూ)
 
Rating:2.5/5

‘రాక్షసుడు’ సక్సెస్ ఎఫెక్ట్ తెలుగు సినిమాపై బాగానే పడింది. ఆ మధ్యన హారర్ కామెడీలు వరసపెట్టి థియోటర్స్ లో దిగినట్లు ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ కట్టకట్టుకుని దాడి చేస్తున్నాయి. చిన్న బడ్జెట్ లో రెడీ అయ్యే ఈ సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ వక్రమార్గంలో ప్రయాణం పెట్టుకోకుండా కట్ టు కట్ అంటూ ఇన్విస్టిగేషన్ ట్రీట్మెంట్ తో పరుగెడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన నాగశౌర్య అశ్వద్దామ, ఇప్పుడీ సినిమా పూర్తి ఇన్విస్టిగేషన్ డ్రామా తో సాగేవే. అయితే వీటికి ప్రేక్షకాదరణ ఎంతో అద్బుతమైతే తప్ప ఉండదు. సీటు అంచున ప్రేక్షకుడుని కూర్చోబెట్టి గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్ తో చూసే స్దాయి ఉంటేనే వర్కవుట్ అవుతాయి. మరి ఈ సినిమా ఆ స్దాయి క్రైమ్ థ్రిల్లరేనా, స్టోరీ లైన్ ఏంటి, సాధారణ ప్రేక్షకుడు చూసి మెచ్చేదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

 హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ (హిట్‌) లో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు (విశ్వక్‌సేన్‌). అతను చాలా తెలివైనవాడు. క్రైమ్ కు సంభందించిన క్లూస్ ని పట్టేయటంలో అపర చాణుక్యుడు. కానీ అతనికి  పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్ డీ) అనే మానసిక సమస్యతో బాధపడుతూంటాడు. గతం నిరంతరం వెంటాడే అతనికి మంటని చూస్తే భయం. అతన్ని ఈ పరిస్దితుల్లో చూసి, చివరకు ఏమైపోతాడో అని భయపడుతూంటుంది అతని గర్ల్ ప్రెండ్ నేహా. ఆమె అతన్ని ఓ ఆరు నెలలపాటు రెస్ట్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. సరేనని ఉద్యోగానికి శెలవు పెట్టి వెళ్లిన అతను అతి తొందరలోనే మళ్లీ వచ్చి డ్యూటీలో చేరాల్సిన అవసరం వస్తుందని ఊహించడు. అతని గర్ల్ ప్రెండ్ అయిన నేహా (రుహానీ) కనిపించకుండా పోవటం అతన్ని కలవరపెడుతుంది. అలాగే అంతకు ముందు ప్రీతి అనే అమ్మాయి సైతం మాయమైందని తెలుస్తుంది. దాంతో ఈ రెండు కేసులకు మధ్య ఏదో సంభందం ఉందని అనుమానించి మళ్లీ డ్యూటీలో చేరి తనదైన శైలిలో ఇన్విస్టిగేట్ చేయటం మొదలెడతాడు. ఈ జర్నీలో అతనికి ఏమి తెలిసింది. ప్రీతి, నేహా ఏమయ్యారు. అసలు ఈ కథలో క్రిమినల్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
 స్క్రీన్ ప్లే ..సర్దుబాట్లు

అప్పట్లో హిచ్ కాక్ సినిమాల్లో ఓ తరహా కథనం ఉండేది. క్రైమ్ చూపెట్టి…దాని వెనక ఉన్న మోటివ్ ని దాచి..క్లైమాక్స్ లో దాని వివరణ ఇస్తూ ముడి విప్పటం. అంటే సినిమా ప్రారంభంలో ఓ ప్రశ్న వేసి..దాన్ని చివర్లో విప్పటం. అయితే ఆ తరహా నేరేషన్ వల్ల కథలో కదలిక తగ్గిపోతోంది, పత్రికల్లో వచ్చే క్రైమ్ స్టోరీలాగ మారిపోతోందని ఈ మధ్యకాలంలో ఎవరూ పెద్దగా ఉపయోగించటం లేదు. కానీ ఈ సినిమాలో అదే ఫాలో అయ్యారు. క్రైమ్ ని ముందుకే ఎస్టాబ్లిష్ చేసి మెల్లిగా దాన్ని ఒక్కో ముడి విప్పటం. ఓకే అంతవరకూ బాగానే ఉంది.

 అయితే ఈ సినిమా కోసం దర్శకుడు గట్టిగా రీసెర్చ్ పోగ్రాం నడిపినట్లున్నాడు. ఫింగ‌ర్ ప్రింట్స్ , డీఎన్ఏ, నార్కోస్‌, లై డిటెక్ష‌న్‌, సీసీ పుటేజ్‌….ఇలా ఇన్విస్టిగేషన్ లో రెగ్యులర్ గా వాడే టెక్నాల‌జీని మ‌న‌కు ప‌రిచ‌యం చేసే పని పెట్టుకున్నాడు. తన జ్ఞానాన్ని మనకు పంచాడు తప్ప..మనం.. లీడ్ క్యారక్టర్ ఎమోష‌న్స్ క‌నెక్ట్ అవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. సినిమాటెక్ గా తీసారు కాబట్టి కానీ లేకపోతే… టీవీలో వ‌చ్చే సీఐడీ సీరియ‌ల్‌కి దీనికి పెద్ద‌గా తేడా లేదనిపిస్తుంది. సినిమా పూర్తయ్యేసరికి మనకి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చాలా సేపు కూర్చున్నట్లు అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.

ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమాని వీలైనంత లాగ్ చేసుకుంటూ లాక్కు వెళ్లాడు ద‌ర్శ‌కుడు.  సినిమా దానంతటే పరుగెట్టదు.  ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో అసలు ఈ క్రైమ్ లకు మూలకారణం ఎవరు,వాడి మనసు మూలల్లో ఉన్నదేమిటి అని చెప్పే పోగ్రాం పెట్టుకోవటం వల్ల, అప్పటిదాకా దాన్ని నడపటం కష్టం అయ్యి, ఆ నిష్టూరం సినిమాని మైల్డ్ గా స్లోగా మార్చుకుంటూ పోయింది. అయితే ఇక్కడ స్లో అయితే ఏమిటి..ప్రీ క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ కు షాక్ అయ్యి…ఆ మూడ్ లోనే థియోటర్ నుంచి చూసేవాడు బయిటకు వెళ్తాడు..అదే సేఫ్ బెట్ అని దర్శకుడు భావించినట్లున్నాడు. అది వర్కవుట్ అవుతుంది కానీ ..ఆ వర్కవుట్ అవటానికి ముందు ఇన్విస్టిగేషన్ జరిగేప్పుడు కూడా ఎంగేజ్ చేయగలిగాలి.

అలాగే ఆ ప్లాష్ బ్యాక్  కోసం స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దు. అలా చేస్తే… అస‌లు క‌థ‌లోంచి ప్రేక్ష‌కుడు డైవ‌ర్ట్ అయ్యే ప్ర‌మాదం ఉంది. లక్కిగా ఈ విషయంలో డైరక్టర్ ఎలర్ట్ గానే ఉన్నాడు. ఇలాంటి థ్రిల్ల‌ర్ చిత్రాలు తీసేట‌ప్పుడు స‌స్పెన్స్  సాగినంతసేపు కొన‌సాగించాల‌ని, కొత్త ట్విస్టులు కలకలం సృష్టించాలని,అందుకోసం క‌థ‌ని మ‌రో ర‌కంగా మ‌లుపు తిప్పాల‌ని ప్ర‌య‌త్నించి, ఆ ఉత్సాహంతో సినిమాని పాడు చేస్తారు. అదే కొంతవరకూ జరిగింది. అదే సెకండాఫ్ ని లేవకుండా పడుకోపెట్టే ప్రయత్నం చేసింది. అలాగే సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతుండటం, ఫన్ కి, పాటలకు ఎక్కడా ఛాన్స్‌ లేకుండా పోయింది.

అతి తెలివి
సినిమా ప్రారంభం నుంచీ హీరో విక్ర‌మ్‌కి ఓ గ‌తం ఉంద‌ని, అదే అతన్ని బాధపెడుతోందని అర్థ‌మ‌వుతూ ఉంటుంది. అయితే ఆ విషయం సినిమా పూర్తయ్యినా తెలియనివ్వడు.  సినిమా చివ‌ర్లో విక్ర‌మ్‌పై జ‌రిగిన ఎటాక్‌.. పార్ట్ 2 లో చూడండంని తేల్చేసి తన తెలివిని ప్రదర్శిస్తాడు. అసలు ఈ సినిమానే సెకండాఫ్ చూడటం కష్టమనిపిస్తుంది. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కూడా ఎదురు చూడాలా అని నిట్టూరుస్తాం.

టెక్నికల్ గా…
దర్శకుడు ఓ మామూలు కధని తీసుకుని దానికి టెక్నికల్ డిటేల్స్ అనే రంగు పూసాడు. అలాగే హీరోకు   పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్ డీ) అనే కొత్త ప్రిమైజ్ సెట్ చేసి కొత్త అనిపించుకుందామనుకున్నాడు. అయితే ఇలాంటి కథలకు తగిన గ్రిప్పింగ్ నేరేషన్ ఈ సినిమాకు లేదు. అలాగే సినిమాలో ఎక్కడా ..ఆహా..అనిపించే మూవ్ మెంట్స్ లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా డిమాండ్ మేరకు బాగున్నాయి. విశ్వక్ సేన్ మాత్రం ఈ సినిమాకు ఆయువుపట్టులా నిలిచాడు.

చూడచ్చా…

రెండు గంట‌ల సేపు ఇన్విస్టిగేషన్ ని కంటిన్యూగా చూడ‌గలం అనిపిస్తే వెళ్లచ్చు. మిగతావాళ్లు ఓటీటి ప్లాట్ ఫామ్ లో వచ్చేదాకా వెయిట్ చేయటం బెస్ట్.

తెర వెనక..ముందు

న‌టీన‌టులు: విశ్వక్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, మురళీ శర్మ, నవీనా రెడ్డి, హరితేజ, శ్రీనాత్ మాగంటి, చైత‌న్య సగిరాజు త‌దిత‌రులు
సంగీతం: వివేక్ సాగ‌ర్
ఛాయాగ్రహణం: మ‌ణికంద‌న్‌
క‌ళ‌: అవినాష్ కొల్లా
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
నిర్మాత‌: ప‌్రశాంతి త్రిపిర్నేని
స‌మ‌ర్పణ‌: నాని
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: శైలేష్ కొల‌ను
సంస్థ: వాల్‌పోస్టర్ సినిమా
విడుద‌ల‌: 28-02-2020