ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ

Published On: September 9, 2022   |   Posted By:
ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ
#OOJ:శర్వా  ‘ఒకే ఒక జీవితం’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
👍
శర్వానంద్ కు ఈ మధ్య సక్సెస్ దక్కలేదు. అందుకేనేమో టైమ్ మిషన్ ఎక్కి దాన్ని వెతుక్కునే ప్రయత్నం చేసాడు. టైమ్ ట్రావెల్ చిత్రాలు మనకు కొత్తేమీ కాదు.  ‘ఆదిత్య 369’నుంచి నిన్నటి ‘బింబిసార’దాకా చూస్తూనే ఉన్నాం. మరి  ఈ సారి ఈ కొత్త సినిమాలో ఏ కొత్త కథ చెప్పారు. శర్వాకు హిట్ ఇచ్చే కథేనా… ? ఈ సినిమాలో అమల పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్:

గిటారిస్ట్ ఆది (శర్వానంద్) , అద్దె ఇళ్ల బ్రోకర్ శ్రీను (వెన్నెల కిషోర్), పెళ్లి కోసం పరితపిస్తున్న చైతు (ప్రియదర్శి)ముగ్గురూ క్లోజ్ ప్రెండ్స్.  ఎవరి పర్శనల్ సమస్యలతో వారు  సతమతమవతూంటారు. జీవితంలో తెలియని అసంతృప్తి. ముఖ్యంగా ఆదికి తల్లి (అమల) లోటు బాగా ఫీల్ అవుతూంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సంగీతం పై దృష్టి పెట్టేలా చేసిన ఆమె ఇరవై ఏళ్ల క్రితం చనిపోతుంది. ఆమే పదే పదే గుర్తు వస్తూంటుంది. ఆమె ఉంటే బాగుండును అనిపిస్తూంటుంది. అయితే చనిపోయిన తల్లి తిరిగి రాదు కదా. కానీ వీళ్ల ముగ్గరు జీవితంలో మిరాకల్ జరుగుతుంది.

ఓ రోజు శ్రీను తో పాటు బయిటకు  వెళ్లిన ఆదికి సైంటిస్ట్ రంగి కుట్ట పాల్ (నాజర్) పరిచయం అవుతాడు.  అతను కనిపెట్టిన టైమ్ మిషన్ తో ఇరవై ఏళ్లు వెనక్కి పంపిస్తానని, తల్లితో మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు.  దాంతో ఈ ముగ్గురు మిత్రులు కలిసి టైమ్ మిషన్ సాయింతో గతంలోకి ప్రయాణిస్తారు. అయితే అక్కడ ఓ అనుకోని ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి… గతంలోకి వెళ్లిన వీళ్లు తిరిగి రాగలిగారా..చివరకు ఏం జరిగింది..ఆది తన తల్లిని కలుసుకున్నాడా….ఆమె చనిపోకుండా ఆపగలిగాడా…శ్రీను, చైతులు ఏమి సాధించారు.  అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది:

ప్రస్తుతం తెలుగులో విభిన్నమైన చిత్రాలకే ఆదరణ దక్కుతోంది. కథలో ఏదో విధమైన విచిత్రమో లేక చిత్రమైన ఆలోచన లేకపోతే జనం ఆసక్తి చూపించటం లేదు.  అలా సినిమాని గట్టెక్కించటానికి, ప్రేక్షకుడుకి విభిన్నమైన ఎక్సపీరియన్స్ ఇవ్వటానికి  టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మంచి అవకాసం. టైమ్ ట్రావెల్ చేసేందుకు మంచి ఎత్తుగడ.. ఊహించని ట్విస్టులు, ఊహకే అందని మలుపులు ఉంటే ఈ టైమ్ ట్రావెలింగ్‌ అలా కుర్చోపెట్టేస్తుంది. కాస్త నేటివిటి టచ్ ఇచ్చి,సెంటిమెంట్ కలిపితే ఇంక తిరుగే ఉండదు. అలాంటి కాన్సెప్టులు ఈ మద్యన ఎక్కువగానే పలకరిస్తున్నాయి.   అక్షయ్ కుమార్ ‘యాక్షన్ రీప్లే’, విష్ణు విశాల్ ‘ఇండ్రు నేట్రు నాళ్’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘బార్ బార్ దేఖో’ లాంటి సినిమాలు కూడా ఓ రకంగా ఈ కోవకి చెందినవే.

రీసెంట్‌‌‌‌గా వచ్చిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, తాప్సీ ‘దొబారా’ కూడా  టైమ్ ట్రావిలింగ్ లో కథ చెప్పబడినవే. అయితే తెలుగులో టైమ్ ట్రావెలింగ్, టైమ్ మిషన్ అంటే ఖచ్చితంగా బాలకృష్ణ ‘ఆదిత్య 369’ని దాటగలగాలి. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుల్లో ఉండే పెద్ద రిస్క్.. స్క్రీన్ ప్లేలో వచ్చే  కన్‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌.దాన్ని దాటిన సినిమాలు ఈ కాల పరీక్షలో నిలబడతాయి. కలెక్షన్స్ కొల్లగొడతాయి. ఒకే ఒకే జీవితం కూడా దాదాపు అలాంటి సినిమానే. టైమ్ మిషన్ తో టైమ్ ట్రావిలింగ్ ఉంది. అలాగే ఈ టైమ్ ట్రావెలింగ్ లో కాస్త ముందుకు వెళ్లి … హాలీవుడ్ చిత్రం లూపర్ ని గుర్తు చేస్తూ గతంలో వాళ్లు ప్రస్తుతంలో, ప్రస్తుతం వాళ్లు గతంలో కనపడుతూ సెకండాఫ్ ని ఇంట్రస్టింగ్ గా మార్చే ప్రయత్నం చేసారు.అదే ఈ సినిమాకు యుఎస్ పి అవ్వాలి. కానీ సెకండాఫ్ లో తల్లి సెంటిమెంట్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ సాగ తీసారు. అది కాస్త ఇబ్బంది పెడుతుంది.

టెక్నికల్ గా

ఈ సినిమా లో తరుణ్ భాస్కర్ డైలాగులు బాగున్నాయి. అలాగే పాటల్లో …ఇప్పటికే ”ఒకటే కదా” పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై ట్రెండింగ్ లో నిలిచినవే. అలాగే ”మారిపోయే” అనే  పాట …స్టార్ హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.  టైమ్ మిషన్ గ్రాఫిక్స్ బాగున్నాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా అదరకొట్టాడు.  ఎడిటర్  శ్రీజిత్ సారంగ్ సెకండాఫ్ ని కాస్త సాగ తీత తగ్గిస్తే బాగుండేది , ఆర్ట్  డైరెక్టర్ సతీష్ కుమార్  పనితనం ప్రత్యేకంగా కనపడుతుంది.  తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ రాసిన డైలాగ్స్ నేచురల్ గా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

నటీనటుల్లో ….

ఎప్పటిలాగే శర్వానంద్…ఎమోషన్,  ఫీల్ గుడ్ సీక్వెన్స్ లలో చాలా బాగా చేసారు.   ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ తమ కామెడీ టైమింగ్ తో ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.   సైంటిస్ట్ గా నాజర్ నటన సహజంగా ఉంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

చూడచ్చా?

ఓ విభిన్నమైన కాన్సెప్టు చిత్రం చూద్దామనుకున్న వాళ్లకి ఈ సినిమా నచ్చుతుంది.

నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
డీవోపీ: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్ డైరెక్టర్: ఎన్.సతీష్ కుమార్
స్టంట్స్: సుదేష్ కుమార్
స్టైలిస్ట్: పల్లవి సింగ్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య
రచన,  దర్శకత్వం: శ్రీ కార్తీక్
Runtime:2 గంటల 35 నిముషాలు.
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు