కృష్ణ వ్రింద విహారి మూవీ రివ్యూ

Published On: September 23, 2022   |   Posted By:
కృష్ణ వ్రింద విహారి మూవీ రివ్యూ
నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’రివ్యూ


Emotional Engagement Emoji (EEE)

👍

నాగశౌర్య బాగానే కష్టపడతాడు. కానీ అతనికి తగ్గ కథలే పడటం లేదు అని చాలా కాలంగా టాక్ ఉంది. అయితే అతని సొంత బ్యానర్ లో చేసిన సినిమా ఇది. కాబట్టి ఖచ్చితంగా గొప్ప కథే ఎంచుకుని ఉంటాడని భావించటంలో వింతేమీ లేదు. అయితే సినిమాకు  అనుకోని అవాంతరంగా.. నాని , నజ్రియా కాంబినేషన్‌లో రీసెంట్‌గా  ‘అంటే సుందరానికీ’ వచ్చి  దెబ్బకొట్టింది. సినిమా క్యారక్టర్,కాంప్లిక్ట్స్ ..స్టోరీ అన్నారు. ఈ సినిమాని రీషూట్ చేసారు అన్నారు. ఈ క్రమంలో జనాలకు సినిమా ఎలా ఉంది అనే దాని కన్నా నిజంగానే ఈ రెండు సినిమాలకు పోలిక ఉన్నాయా అనే ఆసక్తి ఎక్కువైపోయింది.  మరి సినిమా ఎలా ఉంది..నిజంగానే పోలిక ఉందా చూద్దాం.

స్టోరీ లైన్:

గోదావరి జిల్లాలో ఓ అగ్రహారం. అక్కడ  కృష్ణాచారి (నాగశౌర్య) అనే బ్రాహ్మల కుర్రాడు. అతని తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్)…ఓ రాజమాత టైప్. ఆవిడ మాట అంటే ఆ అగ్రహారంలో నే కాదు..ఆ ఇంట్లోనూ వేదవాక్కే. ఆమె కొంగుచాటున పెరిగిన కృష్ణ…సాప్ట్ వేర్ ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. అక్కడ ప్రాజెక్టు లీడర్ గా చేస్తున్న నార్త్ అమ్మాయి  వ్రింద శర్మ (షిర్లే సేతియా)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు మెడికల్ గా ఓ సమస్య ఉంటుంది. దాంతో అతన్ని దూరం పెడుతుంది. అయితే ఆ సమస్య ఓ రోజు మన కృష్ణ కనుక్కుంటాడు.అదేమిటంటే..ఆమెకు పిల్లలు పుట్టరు. తనను ఈ సమస్యతో యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీలోనే తను వెళ్తానంటుంది. మరో ప్రక్క కృష్ణ తల్లి…తన కొడుక్కు ఎప్పుడు పెళ్లి అవుతుందా..తన తల్లే తన మనవడు లేదా మనవరాలు  రూపంలో  పుడుతుంది అని ఎదురుచూస్తూంటుంది. ఈ విషయం తెలిసిన కృష్ణ …తను ఈ సమస్య  అమ్మాయిని చేసుకుంటానంటే ఒప్పుకోరు అని ..చిన్న అబద్దం ఆడతాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు తన మగతనం కోల్పోయానని, దాంతో  తనకు పిల్లలు పుట్టరు అని  తన బంధువైన డాక్టర్(వెన్నెల కిషోర్)తో అబద్ధం చెప్పిస్తాడు. దాంతో పెళ్లి అయ్యిపోతుంది. కానీ ఏదో రోజు అసలు నిజం తెలియాలి కదా అదే జరుగుతుంది. అప్పుడు కృష్ణ ఏం చేసాడు. ఆ సమస్యను ఎలా ఫేస్ చేసాడు వంటి విషయాలు తెలియాలాంటే సినిమా చూడాలి.

ఎనాలసిస్ :

వాస్తవానికి ‘అంటే సుందరానికీ’ కు  ఈ ‘కృష్ణ వ్రింద విహారి’కొంచెం దగ్గర పోలికలే ఉన్నాయి.  అయితే పోలికలు వల్ల ఈ కథకు వచ్చిన నష్టమేమీ లేదు. దాంతో పోల్చిచూసేంత విషయమూ కాదు. అయితే ఇలాంటి రొమాంటిక్ కామెడీలు వర్కవుట్ అయ్యేది కేవలం పగలపడి నవ్వించి, కాస్తంత సెంటిమెంట్ తో అలరిస్తేనే. కానీఈ సినిమా ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు.  హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వటంలో మాత్రం తడబడింది. అందుకు కారణం కథని నిలబట్టే కాంప్లిక్ట్ పాయింట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం..అదీ లైట్ తీసుకునే విషయం కావటం, పెద్ద సమస్య కాకపోవటం వల్ల చూసేవాడికి లైట్ అనిపిస్తుంది. దానికి తోడు డైరక్టర్ సైతం ఈ కథని లైటర్ వీన్ గానే నడపాలని ఫిక్సై స్క్రిప్టు రాసుకున్నారు. సాధారణంగా హీరో ఎదుర్కొనే సమస్య ఎంత బలంగా ఉంటే అంత బాగా సినిమాలు వర్కవుట్ అవుతాయని చెప్తారు. అది నిజం కూడా. ఇలాంటి కథల్లో పరిస్దితులే విలన్స్. ప్రత్యేకంగా విలన్స్ ఉండరు. తను ఆడిన ఒక అబద్దం తన జీవితంలో సమస్యలను తెచ్చి పెడుతూంటే దాన్ని నుంచి తప్పించుకోవటానికి మరిన్ని అబద్దాలు ఆడి, మరింతగా ఇరుక్కుపోయే కథలు ఎప్పుడూ బాగుంటాయి. అయితే ఇందులో తన ప్రేమ కోసం ఆడిన అబద్దంతో తన కుటుంబంలో కలతలు వస్తాయి. వాటిని ఎదుర్కోవటానికి హీరో చేసిందేమీ పెద్దగా కనపడదు. కేవలం ఆ సమస్య వల్ల వచ్చే ఇబ్బందులే కాసేపు నవ్విస్తాయి. అలాగే ఆ సమస్య లోకి సెకండాఫ్ లోకి కానీ హీరో రాడు. అప్పటిదాకా గోళ్ళు గిల్లుకుంటూ కుర్చోలేం కదా.  సుందరం వల్ల కానిది.. ఈ కృష్ణ వల్ల అయ్యిందా  అంటే కొంతవరకూనే అని చెప్పాలి.

టెక్నికల్ గా చూస్తే..

స్క్రిప్టు బాగుంటేనే ఇలాంటి కథలు వర్కవుట్ అవుతాయి. అయితే ఇది పెద్దగా ఎగ్డైట్ చేసే స్టోరీ లైన్ కాదు. కానీ నాగశౌర్య కనెక్ట్ అయ్యి తన బ్యానర్ లోనే చేసాడు. డైరక్టర్ అనుభవం ఉన్నవాడే కొన్ని సీన్స్ లో ఫన్ బాగానే పండించాడు.అయితే అనుకున్న స్దాయిలో హిలేరియస్ గా లేకపోవటంతో ఈ సినిమా తన స్దాయిని,సామర్ధ్యాన్ని కోల్పోయింది.  ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక   కెమెరా వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి.  ఎడిటింగ్ బాగా చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగులే ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది.  CG వర్క్ కూడా బాగోలేదు.

నటీనటుల్లో … నాగశౌర్య తన పాత్రకు న్యాయం చేసాడు. అందులోనూ సిక్స్ ప్యాక్ కూడా పెంచాడు. హీరోయిన్ షిర్లే జస్ట్ ఓకే.    ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ ఫన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. నాగశౌర్య తల్లి పాత్రలో రాధిక శరత్ కుమార్ దుమ్ము రేపింది. ఇక జయ ప్రకాష్, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, సత్య,  హిమజ, అన్నపూర్ణమ్మ వంటి వారు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

చూడచ్చా :

ఎక్కువగా  ఊహించుకోకుండా ఫ్యామిలీతో వెళ్తే నిరాశపరచదు.

నటీనటులు : నాగశౌర్య, షిర్లే సేతియా, రాధికా శరత్ కుమార్, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ, ‘స్వామి రారా’ సత్య, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
సంగీతం: మహతి స్వరసాగర్
సమర్పణ : శంకర్ ప్రసాద్ మూల్పూరి
నిర్మాత : ఉషా మూల్పూరి
దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ
Run Time:2h 19m
విడుదల తేదీ: సెప్టెంబర్ 23, 2022