నేనే వస్తున్నా మూవీ రివ్యూ

Published On: September 29, 2022   |   Posted By:
నేనే వస్తున్నా మూవీ రివ్యూ
ధనుష్ ‘నేనే వస్తున్నా’ రివ్యూ


Emotional Engagement Emoji (EEE)

👍

రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్లకు దర్శకుడు సెల్వ రాఘవన్ పరిచయమే. కమర్షియల్ సినిమా ఫార్మెట్ లోనే   కొంచెం విభిన్నమయిన  కథలను ఎంచుకుంటాడు, అందుకనే తెలుగులోనూ ఆయన సినిమాలంటే  ఆసక్తి ఉంది. ఈసారి  ‘నేనే వస్తున్నా’ (Nene Vastunna) సినిమా ఓ సైకాలజీ థ్రిల్లర్ గా చేసాడు సెల్వరాఘవన్. దానికి తోడు తన తమ్ముడు  ధనుష్ తో చేసిన సినిమా ఇది. చాలా కాలం తర్వాత చేయటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. కానీ అదంతా తమిళం వరకే.  తెలుగు లో అయితే అసలు ప్రమోషన్స్ లేవు. ఎవరికీ  పెద్దగా తెలియదు కూడా ఈ సినిమా విడుదల సంగతి. ఈ నేైపధ్యంలో అసలు ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. వర్కవుట్ అయ్యే మ్యాటరేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

కవల పిల్లలైన కదిర్, ప్రభు (ధనుష్‌) లలో కదిర్ కాస్త తేడా గా ఉంటూంటాడు. దాంతో అతను ఫ్యామిలీకు ఎప్పుడో ఏదో సమస్య తెచ్చిపెడుతూంటాడు. అతని మానసిక ప్రవర్తన సరిగ్గా లేకుండా సైకోలా బిహేవ్ చేసి చివరకు తండ్రినే చంపేస్తాడు. దాంతో తల్లి భయపడిపోయి..తన చిన్న కొడుకు ప్రభుని తీసుకుని వేరే చోటకి వెళ్లిపోతుంది. పాతికేళ్ల తర్వాత… ప్రభు  ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూంటాడు.  తన భార్య భువన (ఇందుజా రవిచంద్రన్), కూతురు సత్యతో ఆనందంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. అలా నార్త్ ఇండియా టూర్  చేసిన తర్వాత కూతురు సత్య మానసిక పరిస్థితి మారిపోతుంది. తనలో తాను మాట్లాడుకోవడం, నిద్రలేమి సమస్యను సత్యను వెంటాడుతుంటాయి. ఆ పాప విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. తనకు సోనూ వేధిస్తున్నాడని చెబుతుంది. ఆ సోనూ ఎవరు అంటే ఓ ఆత్మ. ఆ ఆత్మ కోరిక ఏమిటంటే…తన తండ్రి కదీర్ ని చంపేయమని కోరుతుంది. అప్పుడు ప్రభు తన సోదరుడు ని వెతుక్కుంటూ వెళ్తాడా… అసలు కదీర్ ఏమయ్యాడు? కదీర్‌ను ఆయన సొంత భార్య, పిల్లలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. కదీర్‌ నుంచి ఆయన కుటుంబం ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తారు? తన కుటుంబంపై కదీర్ ఎందుకు కసి పెంచుకొంటాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే…

మామూలుగా …ధనుష్ సినిమాలు డబ్బింగ్ అయ్యి ఒకప్పుడు బాగానే ఆడాయి. రీసెంట్ గా రిలీజైన తిరు సినిమా సైతం ఓటిటిలో మనవాళ్లు తెగ చూస్తున్నారు. అందుకే తన లేటెస్ట్ సినిమాని  డబ్బింగ్  చేసి వదిలాడు. సినిమా మీద నమ్మకం లేకో , నమ్మకం ఎక్కువయ్యో…చడీ చప్పుడూ లేకుండా  హఠాత్తుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పటికప్పుడు అల్లు అరవింద్ రంగంలోకి దిగి నేను పంపిణి చేస్తానంటూ తమిళ ప్రొడ్యూసర్ కు అండగా నిలిచారు. అంతవరకూ బాగానే ఉంది. ట్రైలర్ రిలీజ్ చేసారు.  వాస్తవానికి ఇలాంటి సిట్యువేషన్ లో సినిమాని ఎవరూ పట్టించుకోరు. బజ్ రావడం అంత ఈజీ కాదు.  కానీ ఈ సినిమాకు కావాల్సినంత వచ్చింది. దానికి తోడు అతని అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పదేళ్ల తర్వాత నటిస్తున్న మూవీ ఇది. అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ ని ఢీ కొట్టేందుకు రెడీ అయ్యింది. కానీ అంత సీన్ లేదని మార్నింగ్ షోకే తేలిపోయింది. ఫస్టాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్ దాకా రాసుకున్న కథ,కథనం ఆ తర్వాత డ్రాప్ అవటం స్టార్ట్ అయ్యింది. ఏదో కొత్త కథ చెప్తున్నారేమో అని ఆశపడిన వాళ్లకు అంత సీన్ లేదని సెకండాఫ్ లో తేల్చేసి, చేతులెత్తేసాడు డైరక్టర్. అంత పెద్ద డైరక్టర్ సెల్వ రాఘవన్, అతని బ్రదర్ ధనుష్ కలిసి చేసిన సినిమా కదా అని ఆవేశపడిన వాళ్లకు నీరసం మిగిల్చారు.

మన వాళ్లకు థ్రిల్ల‌ర్ సినిమాల‌ు అంటే ఉన్న క్రేజ్ వేరు. పెద్ద స్టార్లు అవ‌స‌రం లేదు. డాబులు అక్క‌ర్లేకపోయినా చూసేస్తారు. ఓ చిన్న క‌థ‌… దానికి మ‌లుపులు తోడైతే చాలు. లో బ‌డ్జెట్  లో తీసినా పాసైపోవొచ్చు. అయితే స్క్రీన్ ప్లే  లెక్కలు తేడా వేస్తే,  కథలో మలుపులు జనం ముందే ఊహించేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఓటిటిల పుణ్యమా అని చాలా మంచి థ్రిల్ల‌ర్లు మనవాళ్ళు చూసేసారు. ఈ స్ఫూర్తితో ఈ జోన‌ర్‌కి మ‌రింత బ‌లం వ‌చ్చి థ్రిల్ల‌ర్ సినిమాల సంఖ్య పెరిగింది. ఆ జాబితాలో వ‌చ్చిన మ‌రో సినిమా ఇది.  ఈ సినిమాలో ఉన్నవన్నీ  రొటీన్ అంశాలే. కాక‌పోతే.. ఫస్టాఫ్ ఎత్తుగడ కాస్త కొత్తగా చెప్పాడు. అయితే నెగిటివ్ క్యారక్టర్ ని  హీరో ఎలా ప‌ట్టుకున్నాడ‌న్న‌దే.. ప్ర‌తీ క‌థ‌లోనూ సేల‌బుల్ పాయింట్‌.

ఈ క‌థ‌లో చిక్కుముడులు చాలా ఉన్నాయి. వాటిని ఎంత తెలివిగా సాల్వ్ చేశాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. ద‌ర్శ‌కుడి మేథ‌స్సుకు ఇక్క‌డే అగ్ని ప‌రీక్ష ఎదురైంది. ప్రేక్ష‌కుల్ని క‌థ‌లోకి తీసుకెళ్లి, త‌న‌తో పాటు ప‌రిగెట్టించి, త‌న‌లానే ఆలోచింప‌జేసి, ఒక‌వేళ ప్రేక్ష‌కుడు దారి త‌ప్పినా… త‌న దారిలోకి తీసుకొచ్చి క‌థ చెప్పాలనే విషయం మర్చిపోయాడు.. ప్రేక్ష‌కుడి ఇంటిలిజెన్స్ లెవ‌ల్స్   డిస్ట్ర‌బ్ అవ్వ‌కుండా – చిక్కుముడుల‌న్నీ విప్ప‌లేకపోయాడు. నిజంగా ద‌ర్శ‌కుడికి అదే పెద్ద టాస్క్‌. ఫస్టాఫ్ వ‌ర‌కూ ఇవ‌న్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇంటర్వెల్ కూడా ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. సెకండాఫే పూర్తిగా దెబ్బకొట్టింది.

ఎవరెలా చేసారంటే…

లొకేష‌న్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, న‌టీన‌టుల పెర్‌ఫార్మ్సెన్స్ ఈ క‌థ‌ని త‌మ వంతుగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాయి. ధనుష్ కు ఖచ్చితంగా ఇది కొత్త త‌ర‌హా పాత్రే. త‌ను సిన్సియ‌ర్ ఎఫెర్ట్ పెట్టాడు. త‌న‌లోని హీరో మెటీరియ‌ల్‌ని చూపించ‌డం కోసం పాట‌లు, ఫైటింగులు పెట్టుకోకుండా… క‌థ‌ని ఫాలో అయ్యాడు.  ఎమోష‌న్ సీన్స్‌లో అది మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఇందులో  రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర లేదు. కేవ‌లం స‌పోర్టింగ్ రోల్ అనుకోవాలంతే. సైకో తో పాటు కొన్ని పాత్ర‌ల్ని త‌మిళ వాసనలు కొడతాయి.  ఓవ‌రాల్‌గా.. న‌టీన‌టుల‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి. దర్శకుడు సెల్వ రాఘవన్   హర్రర్,  ఏమోషనల్ సన్నివేశాలతో  పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమాలో కీలక సన్నివేశాలు కూడా బాగా స్లోగా అండ్ బోర్ గా సాగాయి..అందుకు దర్శకత్వం. అప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ,ఎడిటింగ్ అన్నీ ఆ బోర్ ని తగ్గిద్దామని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాయి.

చూడచ్చా?

థ్రిల్ల‌ర్లు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ఈవారం ఇది ఫరవాలేదనిపించే ఛాయిసే. కాక‌పోతే మ‌రీ ఎక్కువ‌గా ఊహించుకుని వెళ్ల‌కూడ‌దు.

నటీనటులు : ధనుష్, ఎలీ అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, ప్రభు, యోగిబాబు, సెల్వరాఘవన్, షెల్లీ కిశోర్, శరవణ సుబ్బయ్య తదితరులు
కథ : సెల్వరాఘవన్, ధనుష్
ఛాయాగ్రహణం : ఓం ప్రకాశ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సమర్పణ : గీతా ఆర్ట్స్ (తెలుగులో)
నిర్మాత : కలైపులి ఎస్. థాను
దర్శకత్వం : సెల్వరాఘవన్
Run Time:2 hr 2 Mins
విడుదల తేదీ: సెప్టెంబర్ 29, 2022