తంగలాన్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్

Published On: November 2, 2023   |   Posted By:

తంగలాన్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా తంగలాన్. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుధవారం హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్ లో తంగలాన్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్, దర్శక నిర్మాత పా.రంజిత్, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, హీరో సత్యదేవ్, డైరెక్టర్స్ బాబి, సురేందర్ రెడ్డి, కరుణ కుమార్, వేణు ఊడుగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఎడిటర్ ఆర్కే సెల్వ మాట్లాడుతూ  తంగలాన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఇంతమంది ప్రేక్షకులతో కలిసి టీజర్ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. విక్రమ్ గారి నటనకు నేను అభిమానిని. ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు ఆయన చేసిన స్టన్నింగ్ పర్ ఫార్మెన్స్ చూశాను. మీ అందరూ తంగలాన్ ను ఇష్టపడతారు. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ  తెలుగు సినిమా ప్రేక్షకులు నిజమైన సినిమా ప్రేమికులు. నేను అందాల రాక్షసి సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు రెండోసారి ఇక్కడికి రావడం. తంగలాన్ వంటి గొప్ప ప్రాజెక్ట్ లో భాగమవడం సంతోషంగా ఉంది. పా.రంజిత్ అన్న, విక్రమ్ గారితో వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను. తంగలాన్ టీజర్ చూశాక మీకు సినిమా మీద ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడతాయి. సినిమాతో మీ అంచనాలను అందుకుంటాం. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  డైరెక్టర్ పా.రంజిత్ గారు మట్టి మనుషుల కథలను తెరకెక్కిస్తుంటారు. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. తంగలాన్ వంటి ప్రాజెక్ట్ చేసినందుకు పా.రంజిత్ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఈ సినిమా టీజర్ చూశాకహీరోగా విక్రమ్ గారిని తప్ప మరొకరిని ఈ సినిమాలో ఊహించుకోలేకపోయాను. ఆయన తప్ప భారతదేశంలో మరే నటుడు ఇలాంటి కథను అటెంప్ట్ చేయడని చెప్పగలను. వీరందరినీ కలిపి ముందుకు నడిపించిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా గారికి నా అభినందనలు. జనవరి 26 సినిమా లవర్స్ అందరికీ గొప్ప రోజు కాబోతోంది. అన్నారు.

దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ  మరుగున పడిన ప్రజల కథలను తెరకెక్కించే దర్శకుడు పా.రంజిత్ అంటే నాకు ఇన్సిపిరేషన్, గౌరవం. ఆయన తన సినిమాల్లో చర్చించే అంశాలు, మానవీయ కోణంలో ఎంచుకునే కథా వస్తువులు, పాత్రలు దేశానికి తెలియడం అవసరం. తంగలాన్ వరల్డ్ క్లాస్ సినిమా. తంగలాన్ గొప్ప సినిమా అవుతుంది. ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలని పా.రంజిత్ అన్నను కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ  సేతు సినిమా రిలీజ్ అయినప్పుడు చెన్నైలో విక్రమ్ గారిని చూశాను. మళ్లీ ఇక్కడే ఆయనను కలవడం. పా. రంజిత్ అన్న దర్శకుడిగా నాకు ఇన్సిపిరేషన్. నేను పలాస లాంటి సినిమా చేసినా, ఇప్పుడు మట్కా చేస్తున్నాఅందుకు ఇన్సిపిరేషన్ ఇచ్చింది పా.రంజిత్ అన్న. తంగలాన్ టీజర్ ను నాకు మా మట్కా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ పది రోజుల కిందటే చూపించారు. బ్రేవ్ హార్ట్, అపోకలిప్టో వంటి గొప్ప సినిమాల కోవలోకి తంగలాన్ వెల్తుంది. ఈ సినిమాను ఆస్కార్ కు పంపించే ప్రయత్నం చేయాలని నేను ఈ టీమ్ ను కోరుతున్నా. అన్నారు.

దర్శకుడు బాబి మాట్లాడుతూ  విక్రమ్ గారిని చూసేందుకే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఆయన ఎంచుకునే డిఫరెంట్ మూవీస్ సర్ ప్రైజ్ చేస్తుంటాయి. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న లాంటి మూవీస్ చేయడం విక్రమ్ గారికే సాధ్యమైంది. పా.రంజిత్ గారి సార్పట్ట, మద్రాస్ సినిమాలు రెగ్యులర్ గా చూస్తుంటాను. దర్శకుడిగా ఆయన ఎంతో స్పెషల్ అనిపిస్తుంటారు. వరల్డ్ క్లాసిక్ మూవీస్ కు తీసిపోని విధంగా తంగలాన్ ఉంటుంది. అన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ  దర్శకుడు పా.రంజిత్ గారు చేసే సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. హీరో విక్రమ్ గారికి తన యాక్టింగ్ మీదున్న డెడికేషన్ చాలా గొప్పది. తంగలాన్ టీజర్ ను పదిసార్లు చూసి ఉంటాను. ప్రతిసారీ అందులోని ఫ్రేమ్, షాట్స్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నా మనసులో టీజర్ ఉండిపోయింది. అలాగే ప్రేక్షకుల మనసుల్లో తంగలాన్ సినిమా ఉండిపోవాలని కోరుకుంటున్నా. విక్రమ్ గారు స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలి. తెలుగు ప్రేక్షకులు తంగలాన్ సినిమాను ఆదరించాలని కోరుతున్నా. నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలి. ఆయన తెలుగులో మరిన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ  విక్రమ్ గారి శివపుత్రుడు సినిమా రిలీజ్ అయినప్పుడు నేను టెంత్ క్లాస్ చదువుతున్నాను. ఆయన ఒక జెనరేషన్ నటులను ఇన్ స్పైర్ చేశారు. విక్రమ్ గారి లాంటి నటుడితో ఈ వేదికను పంచుకోవడం గర్వంగా ఉంది. విక్రమ్ గారు ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేశారు. మేము అనుకునేవాళ్లం. ఇంతకంటే విక్రమ్ గారు కొత్తగా చేసేందుకు ఏవైనా సబ్జెక్ట్స్ ఉంటాయా అనికానీ తంగలాన్ టీజర్ చూశాక..ఆయనను ఆయనే రీ ఇన్వెంట్ చేసుకున్నాడు అనిపించింది. దర్శకుడు పా.రంజిత్ గారు మన సొసైటీలోని మూలాల్లోంచి కథలను ఎంచుకుని సినిమాలు చేస్తారు. సార్పట్ట, మద్రాస్ వంటివి నా ఫేవరేట్ మూవీస్. తంగలాన్ మన భారతీయులంతా గర్వపడే సినిమా అవుతుంది. అన్నారు.

హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ  మా సినిమా తంగలాన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ఇక్కడికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ప్రతిసారీ నా సినిమాల ఈవెంట్ కు పెద్ద వాళ్లు గెస్టులుగా వస్తుంటారు. ఈ సారి యంగ్ డైరెక్టర్స్, హీరోస్ వచ్చారు. వాళ్లు నా గురించి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఇప్పటిదాకా పోస్టర్, ఫస్ట్ లుక్స్ చూశారు. తంగలాన్ మూవీకి ఒక ఈవెంట్ లో మీతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడం ఇదే తొలిసారి. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తొమ్మిది నెలలు సినిమాను క్రాంతికుమార్ గారి డైరెక్షన్ లో నటించాను. ఆ సినిమాకు సురేందర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవాడు. అప్పటి నుంచి మా రిలేషన్ కొనసాగుతోంది. అతను హీరో కావాలని నేను కోరుకున్నా కానీ డైరెక్టర్ అయ్యాడు. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి మూవీస్ లాగే తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. మీకు టీజర్ తో తెలిసి ఉంటుంది. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్ తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. పాటలు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా పా.రంజిత్ డిజైన్ చేయలేదు. తంగలాన్ లో ఒక లైఫ్ ఉంటుంది. తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. కొన్నిసార్లు ఒక సీన్ ఒకే షాట్ లో చేశాము. లైవ్ సౌండింగ్ లో చేసేవాళ్లం. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్ లో సినిమా చేయలేదు. నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా. ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. రోజంతా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్లం. ఆ ప్రాంతం వాళ్లు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో..మేమూ అలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ షూటింగ్ చేశాం. నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. ఇంత కష్టపడి చేయలేదు. దానికి కారణం..మా డైరెక్టర్ పా.రంజిత్. ఆయన నా దగ్గరకు ఒక కమర్షియల్ కథ తీసుకురాలేదు. పా.రంజిత్ కెరీర్ లో కమర్షియల్ మూవీస్ తో పాటు ఆర్టిస్టిక్ మూవీస్ చేస్తూ బ్యాలెన్స్ గా కెరీర్ సాగిస్తున్నారు. తన సినిమాలతోనే దర్శకుడిగా ఆయన ఐడియాలజీ, స్పెషాలిటీ చూపించారు. పా.రంజిత్ చేసిన గొప్ప సినిమాల్లో తంగలాన్ ఒకటి అవుతుంది. ప్రేక్షకుల్ని తంగలాన్ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానవేల్ నాకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ..ఇకపైనా మేము సినిమాలు చేస్తాం. గతంలో బాలీవుడ్ సినిమా గురించే దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ తో మనం కూడా ఆస్కార్ గెల్చుకోవచ్చు అని నిరూపించారు దర్శకుడు రాజమౌళి గారు. ఈ వేదిక నుంచి ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశాను. ఆ క్యారెక్టర్స్ లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్న క్యారెక్టర్ లో కనిపించాలంటే నేను హీరో బాడీతో ఉంటే ఎవరికీ నచ్చదు. తెలుగు సినిమాలకు తమిళనాట ఆదరణ లేదు అనడం సరికాదు. అక్కడ తమిళ స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన పరభాషా చిత్రాలున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారను తమిళ ఆడియెన్స్ బాగా ఆదరించారు. అన్నారు.

దర్శక నిర్మాత పా.రంజిత్ మాట్లాడుతూ  తంగలాన్ టీజర్ రిలీజ్ కు ఇక్కడికి వచ్చిన గెస్ట్, మా టీమ్, ఆడియెన్స్ కు థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ నాకున్న పెద్ద సపోర్ట్. అతని లాంటి బ్రదర్ ఉన్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. సినిమా మీద తెలుగు ఆడియెన్స్ చూపించే ప్రేమ స్వచ్ఛమైనది. తంగలాన్ టీజర్ లో మేము చూపించిన కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సినిమా కూడా అలాగే మీకు నచ్చేలా ఉంటుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, విక్రమ్ లాంటి మూవీస్ సాధించిన విజయాలతో నార్త్ సినిమా మీద సౌత్ సినిమా పైచేయి సాధించింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమాలు చరిత్ర సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అనుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దక్షిణాది సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మన సినిమాల్లోని కంటెంట్, మన టెక్నీషియన్స్, ఆర్టిస్టుల ప్రతిభ ఇవాళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. విక్రమ్ గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. తంగలాన్ సినిమాతో ఆ అవకాశం దక్కింది. నటుడిగా సినిమా పట్ల ఆయనకున్న కమిట్ మెంట్, డెడికేషన్ చాలా గొప్పది. విక్రమ్ డైరెక్టర్స్ యాక్టర్. ఒక్కసారి స్క్రిప్ట్ అంగీకరించిన తర్వాత దర్శకుడు సెట్ లో ఏది చెబితే అలా నటిస్తాడు. అంత పెద్ద స్టార్ అయినా నటుడిగా ఆయనలో ఎలాంటి ఈగో ఉండదు. విక్రమ్ గారితో సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. తంగలాన్ లో మేము, మా టీమ్ చేసిన వర్క్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ  నేను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ప్రతిసారీ సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నాకు సినిమాల మీదున్న ప్రేమ, మీకు సినిమాల మీదున్న ప్రేమ ఒక్కటే. మీరు సినిమా బాగుంటే ఏ భాషలోనిదైనా చూస్తారు. కేజీఎఫ్, కాంతారలను సూపర్ హిట్ చేశారు. కోవిడ్ టైమ్ లోనూ థియేటర్స్ కు వెళ్లి సినీ పరిశ్రమకు ఒక నమ్మకాన్ని కలిగించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంతమంచి సినిమా లవర్స్ ఉండటం అప్పుడప్పుడు నాకు ఈర్ష్య కలిగిస్తుంటుంది. నేను ముంబై వెళ్లినప్పుడు అనిపిస్తుంటుందిఒకవేళ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తే..ప్రపంచంలో బెస్ట్ మూవీస్ మనమే చేయగలం. ప్రపంచ సినీ రంగాన్ని ఏలగలం అని. తంగలాన్ మూవీతో ఫస్ట్ టైమ్ విక్రమ్ గారు మా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో నటించడం హ్యాపీగా ఉంది. ఆయన లాంటి గొప్ప నటుడితో సినిమా నిర్మించినందుకు గర్వపడుతున్నా. డైరెక్టర్ పా.రంజిత్ గారు తన టీమ్ తో కలిసి గొప్ప చిత్రాన్ని రూపొందించారు. పా.రంజిత్ గారి అట్టకత్తి సినిమాను మేము రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మా మధ్య అనుబంధం మొదలైంది. ఆయనతో మద్రాస్ సినిమాను నిర్మించాం. ఇప్పుడు తంగలాన్ చేశాం. విక్రమ్, పా.రంజిత్ అనే రెండు డైమండ్స్ కలిసిన సినిమా ఇది. జనవరి 26న మన సినిమా లవర్స్ అంతా తంగలాన్ ను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. తెలుగు మీడియా నాకు కుటుంబం లాంటిది. తెలుగు ప్రేక్షకులతో మా స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి అనుబంధం ఉంది. తంగలాన్ తో అది మరింత బలపడుతుందని ఆశిస్తున్నా. తంగలాన్ ను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. తంగలాన్ ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు ఇండివిజువల్ డేట్ కోసం చూశాం. సంక్రాంతికి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడలో పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందుకే రిపబ్లిక్ డే మంచి డేట్ అనుకున్నాం. తమిళ ప్రజలు తెలుగు సినిమాలు ఆదరించరు అనే అభిప్రాయం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే బాహుబలి 2 తమిళనాటు రెండు మూడేళ్ల పాటు హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ కొనసాగించింది. అప్పట్లో భారత్ బంద్ నుంచి ఇప్పటిదాకా కంటెంట్ బాగున్న ఇతర భాషల సినిమాలను తమిళ ఆడియెన్స్ సక్సెస్ చేశారు. ఆ డిఫరెన్స్ ను తమిళ ఆడియెన్స్ చూపించడం లేదు. కాంతారలో చివరి పదిహేను నిమిషాలు గూస్ బంప్స్ వచ్చినట్లు.ఈ సినిమా మొత్తం అలాంటి హై లో ఉంటుంది. అన్నారు.

నటీనటులు  :

చియాన్ విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్ :

సంగీతం  జీవీ ప్రకాష్ కుమార్
ఎడిటింగ్  ఆర్కే సెల్వ
బ్యానర్స్  స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత  కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం  పా రంజిత్