దర్శకుడు చెందు ముద్దు ఇంటర్వ్యూ

Published On: July 17, 2023   |   Posted By:

దర్శకుడు చెందు ముద్దు ఇంటర్వ్యూ

కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియోపై దర్శకుడు చెందు ముద్దు

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవలే ది విజయ్ దేవరకొండ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. జూలై 21న విడుదల కాబోతోన్న సందర్భంగా దర్శకుడు చెందు ముద్దు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలు ఏంటంటే

నా పేరు చెందు ముద్దు. నేను ఇది వరకు ఓ పిట్ట కథ అనే సినిమాను తీశాను. ఇప్పుడు అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే చిత్రాన్ని తీశాను. చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర ఇలా కొత్త వారితో సినిమాను తీశాను. ఈ మూవీలో నిర్మాత యశ్ రంగినేని గారు కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు.

నేను ఓ స్వచ్చమైన ప్రేమ కథను చెప్పాలని అనుకున్నాను. అందుకే 80ల నేపథ్యంలో కథను తీసుకెళ్లాను. అలా అని ఇప్పుడు స్వచ్చమైన ప్రేమ కథలు లేవని కాదు. కానీ నా సినిమాలోని పాత్రలో ఎంతో స్వచ్చంగా, అమాయకత్వంగా ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రేమను వ్యక్తపరిచే విధానం మారింది. అందుకే పాత కాలంలోకి తీసుకెళ్లి కథను చెప్పాలని అనుకున్నాను. 80ల నేపథ్యాన్ని జోడించడంతోనే సినిమాకు ప్రత్యేకత చేకూరింది.

కథ పరంగా ఓ పిట్టకథకు, అన్నపూర్ణ ఫోటో స్టూడియోకు ఎలాంటి సంబంధం ఉండదు. విలేజ బ్యాక్ డ్రాప్ అన్నది మాత్రమే కామన్ పాయింట్. ఇక ఈ సినిమాలో 80ల నేపథ్యాన్ని రీ క్రియేట్ చేయడానికి చాలానే కష్టపడ్డాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే క్షమించమని ప్రేక్షకులకు ముందుగానే డిస్ క్లెయిమర్‌ వేస్తున్నా.

80, 90ల నేపథ్యం కథ చెబుతున్నామా? ఎప్పటి కథ చెబుతున్నామన్నిది ముఖ్యం కాదు. మనం కథను ఎలా చెబుతున్నామన్నదే ముఖ్యం. సీతారామం సినిమా 60ల నేపథ్యంలో జరుగుతుంది. అయినా జనాలు అంతా కూడా సీతారామంను ఇష్టపడ్డారు. మనం చూపించే విధానంలోనే ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఈ జనరేషన్ వారికి ఈ సినిమా స్లో అని, పాత సినిమా అని అనిపించదు.

వేరే సినిమా కోసం చైతన్య రావ్ నా దగ్గరకు వచ్చి ఆడిషన్ ఇచ్చారు. కానీ ఆయనలో వింటేజ్ లుక్ ఉందని ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. ఈ సినిమాలో హీరో అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ. అందుకే అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని పెట్టుకుని బిజినెస్ట్ స్టార్ట్ చేస్తాడు హీరో. ఆ ఫోటో స్టూడియోకి కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ ఉంటుంది. అందుకే సినిమా పేరు కూడా అదే పెట్టాం.

నేనేం అనుకున్నానో ఆ సినిమాను తీశాను. కొత్త దర్శకుడిని అయినా కూడా యశ్ రంగినేని గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఓ బిగ్ బ్రదర్‌లా నాకు అండగా నిలిచారు. సినిమా విషయంలో ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. బడ్జెట్ ఎక్కువ అని తెలిసినా కూడా ఇందులో రెండు పాటలు ఎస్పీ చరణ్ గారితో పాడించారు.

ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. క్లీన్‌గా ఉంటుంది. ఎక్కడా బోల్డ్ సీన్లు ఉండవు. రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది.

ఓ పిట్ట కథకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన ప్రిన్స్ హెన్రీని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాను. అద్బుతమైన పాటలు ఇచ్చారు. పంకజ్ తొట్టాడ విజువల్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

నిర్మాత కాబట్టి ఆయనకు పాత్ర ఇవ్వలేదు. ఆ కారెక్టర్‌కు ఆయన సెట్ అవుతారని నాకు అనిపించింది. హీరో పాత్ర ఎంత గుర్తుంటుందో యశ్ రంగినేని గారి పాత్ర బాగా గుర్తుండిపోతుంది.

ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశాం. చాలా క్లీన్ సినిమాను తీశాం. మీడియా సహకారం కావాలి. ఆడియెన్స్ వద్దకు ఈ సినిమాను మీడియా తీసుకెళ్లాలి. కొత్త వాళ్లను అందరూ ప్రోత్సహించాలి. అప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి.