ది ఘోస్ట్ మూవీ రివ్యూ

Published On: October 5, 2022   |   Posted By:
ది ఘోస్ట్ మూవీ రివ్యూ
నాగ్  ‘ది ఘోస్ట్ ‘ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍
నాగార్జున `ది ఘోస్ట్‌` పై ఏ మాత్రం నమ్మకం పెట్టుకున్నాడో తెలియదు కానీ బాగా  ప్ర‌చారం చేశాడు. ట్రైలరక్స్, నాగార్జున స్టైలిష్ లుక్ కూడా కొద్దో గొప్పో ఎక్సపెక్టేషన్స్ పెంచేసాయి. `గ‌రుడ‌వేగ‌` వంటి స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని తీసి మెప్పించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరిగిందనేది నిజం. అయతే అది కేవలం ఓ వర్గానికి మాత్రమే పరిమితం. అయితే ఈ  సినిమా ఆ కొందరి అంచనాలకు  త‌గ్గ‌ట్టుగా ఉందా? నాగార్జున అన‌్నట్టుగా `శివ‌` తో సమానమైనదా… చూద్దాం.

స్టోరీ లైన్:

అనగనగా ఓ ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్(నాగార్జున). ఆయనకు అప్పడప్పుడూ కొన్ని  కలలు వస్తూంటాయి. అందులో తాను ఓ మిషన్ ని ఫెయిలైనట్లు వస్తూంటుంది. తన ఎమోషన్స్ ని కంట్రోలు చేసుకోలేకపోతాడు. ఈ క్రమంలో  తన లవర్ పూజా(సోనాలీ చౌహాన్) కు బ్రేకప్ చెప్పి,జాబ్ వదిలేసి,నార్మల్ లైఫ్ లోకి వస్తాడు. ఈ లోగా విక్రమ్ కు ‘అనూ’ ( గుల్ పనాగ్) నుంచి ఓ కాల్ వస్తుంది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత వచ్చిన ఆ కాల్ అతనికి ఏదో డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. అంతే అర్జెంటుగా ఊటీకి వెళ్లి అక్కడ తన సోదరిని,మేనకోడలని (అంకిత)ను కలవటానికి వెళ్తాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు నుంచి బెదిరింపు కాల్స్ వస్తూంటాయి. అంతే ఎలర్ట్ అయ్యిపోతాడు. తనలోని ఇంటర్ పోల్ ఆఫీసర్ స్కిల్స్ ని బయిటకు లాగుతాడు. అక్కడ నుంచి జరిగే యాక్షన్ డ్రామా లో రకరకాల విషయాలు బయిటకువస్తాయి. అవేంటి..అసలు విక్రమ్ సోదరి ఏ సమస్యలో ఉంది…  విక్రమ్ ఏం చేస్తాడు ..ఇంతకీ నాగ్ ని  ‘ఘోస్ట్’ అని ఎవరు పిలుస్తారు..ఎందుకు పిలుస్తారు అనేదే కథ.

Analysis

సాధారణంగా ఇలాంటి సినిమాల్లో యాక్షన్ ఎక్కువగా కనిపించినప్పటికీ, అది ఎమోషన్ ను ప్రధానంగా చేసుకుని నడుస్తూ ఉంటేనే ప్లస్ అవుతుంది. డైరక్టర్స్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సినిమాలోనూ ఇటు ఎమోషన్ .. అటు యాక్షన్ ఉన్నాయి. తనకి జీవితాన్నిచ్చిన ఒక   కుటుంబాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున కనిపిస్తాడు. కానీ అదే సమయంలో ఓ ఇంటర్ పోల్ ఆఫీసర్ చేపట్టే పెద్ద ఆపరేషన్ గురించి కథ చెప్తారేమో అనుకుంటే అది ఓ చెల్లిలి కధగా అజ్ఞాతవాసిగా మిగిలిపోతుంది.  స్క్రీన్ ప్లే .. ట్విస్టులు కూడా ఏమీ లేవు. ఆస్తులు .. వారసులు .. వ్యాపారాల్లో వాటాలు … ఆధిపత్యం కోసం వేసే ఎత్తులు .. పైఎత్తులతో ఈ కథ నడుస్తుంది.   బలమైన విలన్ అంటూ ఉండడు.  కుప్పలు తెప్పలు విలన్స్ ఉంటారు.

వాస్తవానికి రాజశేఖర్ కెరీర్ దారుణమైన పరిస్దితుల్లో ఉన్నప్పుడు వచ్చిన  PSV గరుడవేగ మంచి హిట్ ఇచ్చి మళ్లీ నిలబెట్టింది. దాంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమాలంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. అలాంటి విషయం ఉన్న డైరక్టర్ …  నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తో  కలిసి సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆసక్తి కలుగుతుంది. అంచనాలు ఏర్పడతాయి. కానీ ఆశ్చర్యకరంగా మనం  ఒక అవుట్ డేటెడ్ కథతో వచ్చిన యాక్షన్ ఫిల్మ్‌ని చూస్తాము. దాంతో ఆ  ప్రవీణ్ సత్తారు ఈ సత్తా లేని సినిమా తీసిన దర్శకుడు ఒకరేనా అనే సందేహం వస్తుంది. అయితే సినిమా ప్రారంభంలో మనం ఏదో గొప్ప యాక్షన్ సినిమా చూస్తున్నాము అనే స్దాయి బిల్డప్ ఇచ్చారు. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌  నాగార్జున… దుబాయ్‌లో పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమవుతుంది.

ఇది చాలా  slick గా కనిపిస్తుంది. సత్తారు మమ్మల్ని మరో థ్రిల్ రైడ్‌కి తీసుకెళ్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. సైలెంట్ అయ్యిపోయి, సెల్ ప్రక్కన పెట్టేసి ఫాలో అయ్యిపోతాము. కానీ మన ఉషారుని డైరక్టర్ కొద్ది సేపట్లోనే చంపేస్తాడు.ఈ  పూర్తిస్థాయి యాక్షన్ మూవీని చాలా థిన్ స్టోరీ లైన్ తో అల్లి, దాని చుట్టూ ఆది ,అంతం లేని యాక్షన్ సీక్వెన్స్‌లు పేర్చుకొచ్చాడు.  అవైనా అర్దం పర్దం ఉంటాయా అంటే…ఒకదాని తరువాత ఒకటి, మరియు మరొకటి ఇలా వస్తూనే ఉంటాయి. సినిమా  పూర్తయ్యే టైమ్ కు, మనం ఏకంగా మూడు నాలుగు సినిమాల యాక్షన్ సినిమాలు చూసేసిన ఫీలింగ్ వస్తుంది.  అప్పట్లో శ్రీహరి వరస పెట్టి చేసిన యాక్షన్ సినిమాలు కూడా ఇంతలా కథ లేకుండా ఉండేవి కాదు. ఒకసారి నాగార్జున తుపాకి తీస్తాడు, మరొసారి కత్తి తీస్తాడు.

ఆ కత్తి మామూలుది కాదు..Tamahagane తుపాకి. అదెందుకు తీస్తాడో…దాన్నే ఎందుకు తీసుకున్నాడో రీజన్ ఉండదు. ఇక క్లైమాక్స్ మరో ఎత్తు. వరసపెట్టి మిషన్ గన్ తో …కార్తి ఖైధీ సినిమాని, కమల్ విక్రమ్ ని గుర్తు చేస్తూ కాల్చుకుంటూ పోతాడు. నాగార్జున సిస్టర్ కూడా ఆ గ్యాంగ్ లోనే కూర్చుని ఉంటుంది. అయితే ఆమెకు ఒక్క బుల్లెట్టూ తగలదు. మిగతా వారంతా చనిపోతారు. ఎందుకు , ఎవరిని,ఎలా కాలుస్తున్నాడో అర్దంలేని గన్ ల పోరాటం ఈ సినిమా. ఇంతకీ ఈ స్టోరీ లైన్ ఏమిటీ అంటే…

టెక్నికల్ గా చూస్తే…

దర్శకుడు తుపాకులను ..ఏ ఎమోషన్, కారణం లేకుండా హీరో చేతిలో పెట్టి స్టంట్స్ చేయించాడు కానీ తాను మాత్రం గురి తప్పని తుపాకీలాంటి స్క్రిప్టుని చేత్తో పట్టుకోలేకపోయాడు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ..ప్రవీణ్ యాక్షన్ స్టంట్స్‌ని స్టైలిష్‌గా ఎగ్జిక్యూట్ చేయటమే.  సోనాల్ చౌహాన్ నటన తప్ప అన్నీ చేసింది. ఈ సినిమా అద్భుతమైన విన్యాసాలు చేసింది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తమ పాత్రల్లో పర్వాలేదు. ముఖేష్ సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం భరత్ – సౌరభ్ కట్టిన బాణీలు పెద్దగా ఆకట్టుకోవు. ముఖ్యంగా ‘దూరాలైనా .. తీరాలైనా’ పాటలో ర్యాప్ సాహిత్యాన్ని తట్టుకుని కూర్చోవడం అంత మామూలు  విషయం కాదనిపిస్తుంది.

నటీనటుల్లో…
నాగార్జున పోషించిన ‘ఘోస్ట్’ పాత్ర  కొత్తేమీ కాదు. అయితే ఈ వయస్సులో అలా చేసి మెప్పించటం సామాన్యమైన విషయం కాదు. మిగతా ఆర్టిస్ట్ లు అయితే ఎవరినీ పద్దతిగా డిజైన్ చెయ్యలేదు. ఎవరూ గుర్తుండరు.  సోనాల్‌ చౌహాన్‌, గుల్‌ పనాగ్‌ బాగా చేసారు. అంతే

చూడచ్చా?

ఫైట్స్ తప్పించి ఏ విధమైన  ప్రత్యేకత లేని ఈ సినిమా సాదాసీదా అభిమానిని ఆకట్టుకోవటం కష్టమే. నచ్చాలంటే అక్కినేని అభిమాని అయ్యిండాలి అన్నట్లుంది.

సంస్థ: శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌;
నటీనటులు: నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌, గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌, రవి వర్మ, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, జయప్రకాశ్‌, తదితరులు;
సినిమాటోగ్రఫీ: ముకేశ్‌;
ఎడిటింగ్‌: ధర్మేంద్ర;
నేపథ్య సంగీతం: మార్క్‌.కె.రాబిన్‌;
పాటలు: భరత్‌-సౌరభ్‌;
నిర్మాతలు: సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌;
రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు,
Runtime: 135 minutes
విడుదల తేదీ: 05-10-2022