సినిమాటోగ్రాఫర్ జి మురళి ఇంటర్వ్యూ

మణిరత్నం సినిమా లాంటి విజువల్ బ్యూటీ ఖుషి లో చూస్తారు సినిమాటోగ్రాఫర్ జి మురళి

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి మూవీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ అందుకున్న ఖుషి సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు పనిచేసి అనుభవాలు తెలిపారు సినిమాటోగ్రాఫర్ జి.మురళి.

నేను పుట్టింది తమిళనాడులో. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్, పెయింటింగ్, సోషల్ ఇష్యూస్, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేశాను. కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఇంట్రెస్ట్ కలిగింది. లైఫ్ లో ఎక్కువగా ఊహించుకోవడం కంటే వాస్తవిక జీవితంలో ఉండటానికి ఇష్టపడతాను. నేను సినిమాటోగ్రఫీ చేసే సినిమాలు కూడా అలా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండాలని కోరుకుంటా.

నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అందాల రాక్షసి మూవీకి పనిచేశాను. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషినే. మైత్రీ రవి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదు. సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు. ఫిలిం మేకింగ్ లో వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు.

మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాం. మీరు కథ వినండి అని చెప్పారు. అలా శివ గారు కథ చెప్పారు బాగా నచ్చింది. ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యా.

ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ఈ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి.

దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ఖుషిలో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం.

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషి ఉంటుంది. ఇందులో విప్లవ్, ఆరాధ్య క్యారెక్టర్ లలో విజయ్, సమంత నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాళ్ల క్యారెక్టర్స్ మధ్య వచ్చే సందర్భాల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్, డీటెయిల్స్ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చాయి. క్యారెక్టర్ లో ఎంతవరకు నటించాలో విజయ్ కు బాగా తెలుసు. ఖుషిలో అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి పనిచేశాను.

నేను పనిచేసిన గత చిత్రాలు కాలా, సార్పట్ట వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ఖుషిలో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను.