లాక్‌డౌన్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎలా

లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లకూడదని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. మందుల కోసమో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లవలసిన పరిస్థితి. అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని యువ దర్శకుడు శైలేష్ కొలను వీడియో చేసి మరీ చూపించారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘హిట్: ది ఫస్ట్ కేస్’తో దర్శకుడిగా శైలేష్ పరిచయం అయ్యారు. కరోనాపై పోరులో ‘హిట్’ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తే మంచిదని వీడియో చూసినవారు ప్రశంసిస్తున్నారు.

కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో, మహమ్మారి మన దరికి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శైలేష్ కొలను మాట్లాడుతూ “లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకూ పొడిగించడంతో మనకు ఇంకొన్ని రోజులు ఇబ్బంది తప్పదు. ఈ సమయంలో సరుకులు, మందులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? అనేది మనమంతా తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. నేను దర్శకుడు కావడానికి ముందు, హెల్త్ కేర్ ప్రాక్టీషనర్‌ని. డిసీజ్ కంట్రోల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల… నేను బయటకు వెళుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది చూపిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశా” అని అన్నారు.