కస్టడీ మూవీ రివ్యూ

Published On: May 12, 2023   |   Posted By:

కస్టడీ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

నిజం గెలవడానికి లేట్ అవుతుందికానీ కచ్ఛితంగా గెలుస్తుంది అనే పాయింట్ హైలెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ కు బాగా కీలకమైనది మరో ప్రక్క రీసెంట్ గా ఏజెంట్ తో అఖిల్ డిజాస్టర్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కినేని అభిమానుల ఆశలు అన్నీ కూడా ఈ కస్టడీ సినిమా మీదే వున్నాయి.ఈ క్రమంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది. కథేంటి  చైతన్యకి బ్రేక్ వచ్చిందో లేదో చూద్దాం.

కథేంటి :

శివ (నాగచైతన్య) చట్టానికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్‌. ఓ ప్రక్క అతని ప్రేమ సమస్యలో ఉంది. ప్రేమించిన అమ్మాయి డ్రైవింగ్‌ స్కూల్‌లో పనిచేసే రేవతి(కృతిశెట్టి) కి మరొక వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయిస్తున్నారు. ఆ టెన్షన్ లో ఉండగానే అతను మరో పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. అది అతను సమస్యగా భావించక భాధ్యతగా ఫీలవుతాడు. అదేమిటంటే ఒక క్రిమినల్ రాజు(అరవింద్ స్వామి) ని పట్టుకుని బెంగుళూరులో కోర్టు ముందు హాజరుపరిచే ప్రయత్నంలో ఉంటుంది సీబీఐ. అయితే ఓ గ్యాంగ్ అతన్ని చంపేయాలని, అతన్ని నుంచి నిజాలు బయిటపడకూడదని స్కెచ్ వేసుకుని అమలు చేస్తూంటుంది. అయితే అనుకోని పరిస్దితుల్లో శివ చేతికి ఆ క్రిమినల్ చిక్కుతాడు. దాంతో అతన్ని కోర్టుకు తనే తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతను పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు. రాజుని చంపుదామనుకున్నవాళ్లు అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంటారు. మరో ప్రక్క ప్రిమించిన రేవతి తనకు బలవతంగా చేస్తున్న పెళ్లి తప్పించుకుని హీరో దగ్గరకి చేరుకుంటుంది. ఇప్పుడు శివ..తనను,తన ప్రేయసిని సేవ్ చేసుకుంటూ క్రిమినల్ రాజుని కోర్టుకు అప్పచెప్పాలనుకునే ప్రాసెస్ లో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి..వాటిని శివ ఎలా ఎదుర్కొన్నాడు..ఈ కథలో ఐజీ నటరాజన్‌(శరత్‌ కుమార్‌) , జార్జ్ (సంపత్ రాజ్) , దాక్షాయణి(ప్రియమణి) పాత్రలు ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే :

ఈ మధ్యకాలంలో పాత మూస కథలునైనా కొత్త దర్శకులు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కష్టడీ దర్శకుడు సీన్స్ గానీ, కథనం గానీ కొత్తగా ఏమీ మార్చకుండా రెండు దశాబ్దాల క్రిందటి తన తరహా మేకింగ్ తోనే కానిచ్చేశాడు. దాంతో చాలా వరకూ కొత్త సినిమా చూస్తున్నట్లు అనిపించదు. ఫస్ట్ సీను నుంచీ చివరిదాకా పాత సినిమా చూస్తున్నట్టే వుంటుంది. ఈ సినిమాలో ఆసక్తి కల్గించే ఒక్క సీనూ, నటుల మధ్య డ్రామాతో సూపర్బ్ అన్పించే ఒక్క ఎపిసోడ్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. ఎంతసేపూ ఛేజింగ్ లు, పైట్స్ కోసం తాపత్రయపడే కథనంతోనే నడిపారు. దాంతో ఎక్కడా భావోద్వేగాలుకు ప్లేసే లేకుండా పోయింది. అలాగే సినిమాలో నాగచైతన్య వంటి హీరో ఎదుర్కోవటానికి ఫలానా వాడు విలన్ అని చెప్పే పరిస్దితి లేదు. దాంతో హీరో ఎక్కడిక్కడ సీన్ ని బట్టి రియాక్ట్ అవుతాడే కానీ కథలో భాగంగా ముందుకు వెల్తున్నట్లు అనిపించదు. హీరో పాత్ర స్వభావంలో మార్పేమీ లేక చైతు తనలోని నటుడుని బయిటకు తీయటానికి అవకాసం లేకపోయింది. విలన్ ఎవరో క్లారిటీ వస్తే ..హీరోకి విలన్ కు మధ్యే విభేదాలతో సంఘర్షణ సృష్టించ వచ్చు. అప్పుడు ఇది అర్ధవంతమైన కథ అయ్యి ఆకట్టుకునేది. దానికి తోడు పాతకాలం ఫ్లాష్ బ్యాకులు చూసీ చూసీ విసుగొచ్చేస్తుంది. సెకండాఫ్ లో వచ్చే ఈ ప్లాష్ బ్యాక్  వల్ల కథకు ఉన్న గ్లామర్ కోల్పోయింది.ఫ్లాష్ బ్యాక్ ముగించాక ఈ సినిమా ఎంత పేలవమైనదో అర్దమవుతుంది.

నటీనటుల్లో :

సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే అండర్ డాగ్ పాత్రలో నాగ చైతన్య బాగానే నటించాడు. ఇది అతనికి టైలర్ మేడ్ క్యారెక్టర్. చైతన్య కన్విన్సింగ్‌గా కనిపించారు. కృతి శెట్టి హీరోయిన్ గా చేసింది కానీ ఆమెకు చెప్పుకోదగిన పాత్ర లేదు. , అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించారు. వాళ్లవే ఉన్నంతలో హైలెట్. తమిళ నటులు రాకీ,జీవాలకు జాకీలేసి మరీ లేపారు కానీ రెస్పాన్స్ లేదు. సినిమాలో టీవి సీరియల్ వంటలక్క పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

టెక్నికల్ గా :

థ్రిల్లర్‌ల విషయంలో వెంకట్ ప్రభు మాస్టర్ అంటారు కానీ ఆ అనుభవం ఇక్కడ కనపడలేదు. భారీ ఎత్తున నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కించారు. కానీ అవేమీ ఎలివేట్ కాలేదు. ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నతంగా వుంది. ఎస్ఆర్ కతీర్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్కవుట్ కాలేదు.వెంకట్ రాజన్ ఎడిటింగ్ మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.

చూడచ్చా:

నాగచైతన్య అభిమానులు సైతం నమస్కారం బాబూ అనేలా ఉంది

నటీనటులు :

నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

సాంకేతికవర్గం :

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
రన్ టైమ్ : 147 నిమిషాలు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేదీ: మే 12, 2023.