హీరో ఆకాష్ ఇంటర్వ్యూ

Published On: December 29, 2023   |   Posted By:

హీరో ఆకాష్ ఇంటర్వ్యూ

ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్, మెసేజ్ ఉన్న మంచి సినిమా సర్కారు నౌకరి హీరో ఆకాష్

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ సర్కారు నౌకరి సినిమాతో హీరోగా పరిచయవుతున్నారు. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన సర్కారు నౌకరి సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని హైలైట్స్ తెలిపారు హీరో ఆకాష్.

మా అమ్మ ఫేమస్ సింగర్. వారసులు వాళ్ల తల్లిదండ్రుల ప్రొఫెషన్ నే అనుసరించాలని లేదు. నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని. అలాగే డ్యాన్స్ క్లాసులకు వెళ్లాను. నటుడిని కావాలనే కోరిక బలంగా ఉండేది. స్కూల్ డేస్ లోనే అమ్మకు ఈ విషయం చెబితే నువ్వు సినిమాల్లో ట్రై చేయడానికి ఇంకా చాలా టైమ్ ఉంది అని చెప్పేది. ఢిల్లీలో చదువులు పూర్తయ్యాక నా డ్రీమ్ గురించి ఇంట్లో చెప్పాను. నేను హీరోగా సక్సెస్ అవుతానా లేదా అనేది కాదు కనీసం ట్రై చేస్తాను అని అన్నాను. నేను స్ట్రాంగ్ డెసిషన్ తో ఉన్నానని అమ్మకు అప్పుడు అర్థమైంది.

ఉత్తేజ్ గారి మయూఖ ఇన్ స్టిట్యూట్ లో రెండున్నర నెలలు యాక్టింగ్ కోర్సు చేశాను. యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను కలుస్తుండేవాడిని. అవకాశాల కంటే ముందు పరిచయాలు చేసుకున్నాను. ఈ క్రమంలో దర్శకుడు శేఖర్ కథ గురించి చెప్పి కలిశారు. నాకు, అమ్మకు కలిసి సర్కారు నౌకరి కథ చెప్పారు. కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే ఇష్టం. నేను చేసే ఫస్ట్ మూవీ యాక్షన్, డ్రామా, కామెడీ, మెసేజ్…ఇలా పర్టిక్యులర్ జానర్ లో ఉండాలని కోరుకోలేదు. ఓ మంచి సినిమాతో లాంఛ్ అవ్వాలని మాత్రమే అనుకున్నా.

90వ దశకంలో మన దేశంలోకి ఎయిడ్స్ అనే మహమ్మారి వచ్చింది. అప్పటికి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వస్తుంది, కండోమ్స్ వాడితే ఎయిడ్స్ రాకుండా అరికట్టవచ్చు అనే విషయాల మీద అవగాహన లేదు. అలాంటి టైమ్ లో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో ఎయిడ్స్ మీద అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారు చెప్పే విషయాలను ప్రజలు నమ్మరు. అలా ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలను ఒక వ్యక్తి చేసినట్లు, వన్ మ్యాన్ షోలా చూపించే చిత్రమిది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కండోమ్స్ వాడకం, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, ఇందుకు అతనిలో ఉన్న మరో బలమైన కారణం ఏంటి అనేది సర్కారు నౌకరి సినిమా కథాంశం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నారు.

సర్కారు నౌకరి కథలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్, మెసేజ్ అన్నీ ఉన్నాయి. ఇది కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదు. నా క్యారెక్టర్ లో ఉద్యోగ ధర్మం, ప్రజల్ని చైతన్య చేయాలనే లక్ష్యం ఉంటాయి. అదే టైమ్ లో నా ఉద్యోగం పట్ల నా మిత్రులు, నా భార్య ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎయిడ్స్ గురించి ఇప్పుడు సొసైటీకి అవగాహన వచ్చింది. అయితే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి పట్ల ఎలాంటి అవగాహన ఉండేది. దాని గురించి చెప్పినా ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యేవారు అనేది అన్ని ఎమోషన్స్ కలిపి సినిమాటిక్ గా చూపిస్తున్నాం. శానిటరీ ప్యాడ్స్ గురించి ఇవాళ ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. అయినా బాలీవుడ్ లో ప్యాడ్ మ్యాన్ అనే సినిమా చేశాడు అక్షయ్ కుమార్. ఆ సినిమాను ప్రేక్షకులంతా ఆదరించారు. మన సొసైటీలో ఒక టైమ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను ఫిక్షన్ కలిపి ఈ సినిమా చేశాం.

నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే సర్కారు నౌకరి లాంటి కథనే డెబ్యూ మూవీకి కరెక్ట్ అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లోనూ నటించాలని ఉంది. సర్కారు నౌకరికి ఒకప్పుడు ఎంతో ఇంపార్టెన్స్ ఉండాలి. సొసైటీలో కొన్ని పనులు చేసేందుకు వాళ్లు చాలా కీలకం.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా నేను హీరోగా లాంఛ్ అవడాన్ని నా లైఫ్ లో మర్చిపోలేను. ఆయన చేతుల మీదుగా వెంకటేష్ గారు, టబూ గారు, మహేశ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా..ఎంతోమంది స్టార్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు. అలాంటి వారి లిస్టులో నా పేరు కూడా ఉందంటే అంతకంటే అదృష్టం లేదు. ఆయనకు రోజూ పాదాభివందనం చేయాలని ఉంది. రాఘవేంద్రరావు గారు రూపొందించిన సినిమాలను బాగా ఇష్టపడతాను. సర్కారు నౌకరి సినిమా ప్రమోషన్ లో రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ ఆకాష్ సునీత అబ్బాయి, ఆకాష్ అంటే నాకు బాధ్యత అన్నారు. ఆ మాటతో ఎమోషన్ అయ్యాను.

టీజర్ లాంఛ్ లో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను రాఘవేంద్రరావు గారు, తనికెళ్ల భరణి లాంటి పెద్ద వాళ్లతో కలిసి పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ అమ్మకు, నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నేను బాగా నటించగలను అని ప్రేక్షకులు గుర్తించాలి, నా సినిమా హిట్ కావాలి అని అమ్మ కోరుకుంటుంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను. ఇంకా కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు.